Har Shikhar Par Tiranga | లడఖ్‌లో యశ్వంత్ సాహసం!

Har Shikhar Par Tiranga | లడఖ్‌లో యశ్వంత్ సాహసం!

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ (Har Shikhar Par Tiranga) జాతీయ మిషన్‌లో భాగంగా 6 వేల మీటర్లకు పైబడిన రెండు శిఖరాలను విజయవంతంగా అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటాడు.

ఈ యాత్రలో భాగంగా 6,100 మీటర్ల ఎత్తులోని కియాగర్ రీ, 6,125 మీటర్ల ఎత్తులోని మౌంట్ నోమాడ్స్, అలాగే 6,037 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ పేరులేని, ఎవరూ అధిరోహించని కన్యా శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో యశ్వంత్ బయలుదేరాడు. అయితే కోర్జోక్ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అతడి ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా 66 శాతానికి పడిపోవడంతో తీవ్ర తలనొప్పి, అలసట, బలహీనత, వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతే యాత్రను కొనసాగించాడు.

మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు, బలమైన చల్లని గాలులు, తక్కువ ఆక్సిజన్, సాంకేతికంగా క్లిష్టమైన పర్వత మార్గాలు యాత్రను మరింత సవాలుగా మార్చాయి. పరిస్థితులను అంచనా వేసిన యశ్వంత్ భద్రత దృష్ట్యా కియాగర్ రీ శిఖరారోహణను మధ్యలోనే విరమించుకున్నప్పటికీ, మౌంట్ నోమాడ్స్ (6,125 మీటర్లు)తో పాటు 6,037 మీటర్ల ఎత్తులోని పేరు లేని శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు.

ప్రత్యేకంగా 6,037 మీటర్ల ఎత్తులోని ఈ శిఖరం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక పేరు లేకుండా, గతంలో ఎవరూ అధిరోహించిన రికార్డులు లేని శిఖరంగా గుర్తింపు పొందింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ శిఖరాన్ని అధిరోహించడం యాత్రలో అత్యంత విశేష ఘట్టంగా నిలిచింది.

శిఖరాలను చేరుకున్న అనంతరం యశ్వంత్ భారత జాతీయ జెండాతో పాటు అస్సాం రైఫిల్స్ జెండాను కూడా ఎగురవేశాడు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అస్సాం రైఫిల్స్ సిబ్బందికి ఇది తన నివాళిగా పేర్కొన్నాడు.

అంతేకాకుండా పేరు లేని 6,037 మీటర్ల శిఖరానికి భారత వైమానిక దళ అధికారి ఫ్లయింగ్ ఆఫీసర్ వినోద్ కుమార్ చామా పేరు పెట్టాలని ప్రతిపాదించాడు. దేశ సేవలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపాడు.

ఈ యాత్ర తన పర్వతారోహణ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందని యశ్వంత్ పేర్కొన్నాడు. ప్రతి దశలో మానసిక ధైర్యం, ఓర్పు, పట్టుదల ఎంతో అవసరమయ్యాయని చెప్పాడు. తన విజయానికి సహకరించిన స్పాన్సర్లు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయాన్ని వారికి అంకితం చేశాడు.

కాగా, భూక్య యశ్వంత్ ఇప్పటికే ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, యూరప్‌లోని మౌంట్ ఎల్బ్రస్, ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసియస్కో, కాంగ్ యత్సే-2, ఎవరెస్ట్ బేస్ క్యాంప్, మౌంట్ గోరిచెన్ వంటి ప్రముఖ శిఖరాలను అధిరోహించాడు. ప్రపంచంలోని అత్యున్నత శిఖరాలపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడమే తన లక్ష్యమని తెలిపాడు.