BCCI | బీసీసీఐ దగ్గర మనీ ప్రింటింగ్ మెషీన్..
BCCI | బీసీసీఐ దగ్గర మనీ ప్రింటింగ్ మెషీన్..
క్రికెట్ అంటే మనకి వినోదం.. కానీ బీసీసీఐకి మాత్రం అది బంగారు బాతుగా మారింది. గత 19 ఏళ్లుగా నిరంతరంగా కాసుల వర్షం కురిపిస్తూ, ప్రతి సీజన్‌తో కొత్త ఆర్థిక రికార్డులు సృష్టిస్తోంది. కోట్లలో మొదలైన ఆదాయం.. ఇప్పుడు వేల కోట్ల స్థాయికి చేరింది. ఏడాది గడిచేకొద్దీ ఖజానా మరింత నిండుతూనే ఉంది. దీంతో ప్రపంచ క్రికెట్లోనే అత్యంత లాభదాయక బోర్డుగా బీసీసీఐ మారిపోయింది. లెక్కలు చూస్తే.. “వామ్మో.. ఇంత డబ్బా!” అనకుండా ఉండలేరు.
అంచలంచెలుగా ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక లీగ్‌గా ఎదిగింది. అలా.. బిసిసిఐ (BCCI) పాలిట ఇది ఒక అద్భుతమైన కామధేనువులా మారింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్, కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలికి కాసుల వర్షం కురిపిస్తోంది. గడిచిన 19 ఏళ్లలో ఐపీఎల్ సంపాదన, బిసిసిఐ ఆర్జించిన లాభాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ప్రారంభంలో అంటే 2008లో ఐపీఎల్ ఆదాయం దాదాపు రూ.1,000 కోట్లు కాగా, బిసిసిఐకి వచ్చిన నికర లాభం కేవలం రూ.14 కోట్లు మాత్రమే. ఆ తర్వాతి ఐదేళ్లలో అంటే 2009 నుండి 2013 వరకు ఈ ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2013 నాటికి ఐపీఎల్ ఆదాయం రూ.1,195 కోట్లకు చేరుకోగా, బోర్డు లాభం రూ.334 కోట్లకు పెరిగింది. లీగ్ పై ప్రజాదరణ పెరగడం, బ్రాండ్ వాల్యూ ఊపందుకోవడంతో బిసిసిఐ ఖజానా నిండటం మొదలైంది.
ఇక 2017 నుంచి ఐపీఎల్ ఆదాయంలో ఊహించని భారీ జంప్ కనిపించింది. మీడియా హక్కుల విక్రయం ద్వారా 2017లో ఆదాయం ఏకంగా రూ.3,412 కోట్లకు చేరింది, అలాగే లాభం రూ.1,440 ಕೋట్లకు పెరిగింది. కోవిడ్ మహమ్మారి సవాలు విసిరిన 2020, 2021 లీగ్‌లలో కూడా ఐపీఎల్ క్రేజ్ తగ్గలేదు. 2020లో రూ.2,100 కోట్లు, 2021లో రూ.2,367 కోట్ల భారీ లాభాలను బిసిసిఐ సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ బ్రాండ్ యొక్క తిరుగులేని శక్తిని నిరూపించింది.
ఇక సరికొత్త డిజిటల్, టీవీ ప్రసార హక్కుల డీల్స్ తర్వాత 2023 నుండి ఐపీఎల్ ఆదాయం ఆకాశాన్ని తాకింది. 2023లో ఏకంగా రూ.11,801 కోట్ల ఆదాయంతో రూ.5,120 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2024లో కూడా అదే జోరును కొనసాగిస్తూ రూ.12,006 కోట్ల ఆదాయాన్ని, రూ.5,113 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
ఇటీవల ముగిసిన 2025 సీజన్ లో ఆదాయం దాదాపు రూ.12,450 కోట్లుగా ఉండగా, బిసిసిఐ అంచనా వేసిన లాభం ఏకంగా రూ.6,280 కోట్లు. కేవలం 14 కోట్ల లాభంతో మొదలైన ప్రయాణం.. నేడు రూ.6,000 కోట్లకు పైగా లాభాల స్థాయికి చేరడం చూస్తుంటే, ఐపీఎల్ నిజంగానే క్రికెట్ ప్రపంచంలో ఒక తిరుగులేని మనీ ప్రింటింగ్ మెషిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
