మక్తల్‌లో సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
మక్తల్‌లో సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
మక్తల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మక్తల్‌లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ పర్యటనకు సంబంధించి మక్తల్ టౌన్‌లోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని, అలాగే మండలంలోని కాట్రేవుపల్లి శివారులో ప్రతిపాదిత మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాంతంలో చేపట్టనున్న ఏరియల్ సర్వే, స్టేజ్-1 పనుల పరిశీలన కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీను, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు, పోలీసు శాఖ అధికారులతో కలిసి సీఎం పర్యటన మార్గాలు, హెలిప్యాడ్ ప్రాంతం, పార్కింగ్ స్థలాలు, వీఐపీ రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ఎస్పీ సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని చెప్పారు. అదే విధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపడుతుందని, ప్రజలు పోలీసులకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రామ్‌లాల్, ఎస్ఐ పి. రాజు, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
