నీటి ప్రతి బొట్టు.. రైతుకు బంగారు భవిష్యత్తు!
నీటి ప్రతి బొట్టు.. రైతుకు బంగారు భవిష్యత్తు!
ఉద్యానవన రంగానికి పెద్దపీట.. 15 వేల హెక్టార్ల విస్తరణ లక్ష్యం
డ్రిప్ సేద్యంతో నీటి పొదుపు, రైతులకు అధిక ఆదాయమే ధ్యేయం: కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ: కరవు పరిస్థితులు తరచూ ఎదురయ్యే రాయలసీమ ప్రాంతంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ ఉద్యానవన రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని 15 వేల హెక్టార్లకు పెంచడంతో పాటు పండ్ల తోటలన్నింటినీ దశలవారీగా డ్రిప్ సేద్యం కిందకు తీసుకురావాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కర్నూలు మండలం తొలిసాపురం గ్రామంలో రైతు గోవర్ధన్‌రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను కలెక్టర్ పరిశీలించారు. తోటలో అమలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ విధానం, అంతర పంటల సాగు, నీటి వినియోగ పద్ధతులపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
డ్రిప్ సేద్యంపై రైతులకు సాంకేతిక అవగాహన
డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్క్రీన్ ఫిల్టర్, వాల్వులు, హెడ్ కంట్రోల్ యూనిట్ (హెచ్‌సీయూ) వంటి పరికరాల వినియోగం, నిర్వహణపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.
అలాగే డ్రిప్ వ్యవస్థ ద్వారా ఎరువులను నేరుగా మొక్కలకు అందించే ఫెర్టిగేషన్ విధానంపై కూడా సాంకేతిక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో నీటి పొదుపుతో పాటు ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చని, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ రైతులకు వరంగా మారుతుందని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక తోటల సాగుకు ప్రాధాన్యం
జిల్లాలో కాలానుగుణ పంటలతో పాటు దీర్ఘకాలిక తోటల సాగును మరింత ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. మామిడి, జామ, నిమ్మ, ఆయిల్‌పామ్ వంటి పంటలు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించగలవని చెప్పారు.
ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే తోటలతో పాటు ఇప్పటికే ఉన్న పండ్ల తోటలన్నింటిలోనూ డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
10 వేల హెక్టార్లలో డ్రిప్ సేద్యం లక్ష్యం
గత ఏడాది జిల్లాలో 8,260 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ అమలైందని, ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో డ్రిప్ సేద్యం అమలు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలని అధికారులను ఆదేశించారు.
డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలపై రైతులకు విస్తృత ప్రచారం నిర్వహించాలని, అర్హులైన ప్రతి రైతు లబ్ధి పొందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ఉద్యానవన విస్తరణతో ఆదాయం.. నీటి సంరక్షణతో భవిష్యత్తు
వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్ల మధ్య తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించడమే భవిష్యత్ వ్యవసాయానికి కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యానవన పంటల విస్తరణ, డ్రిప్ సేద్యం ప్రోత్సాహం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు నీటి వనరుల పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్, కర్నూలు తహశీల్దార్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
