రోడ్డు త్రవ్వారు వదిలేశారు..
రోడ్డు త్రవ్వారు వదిలేశారు..
- ప్రమాదకరంగా మారుతి నగర్ రోడ్ నెంబర్ 2
- కార్పొరేషన్ నేషనల్ హైవే మధ్యలో దోబూచులాట
మంచిర్యాల, ఆంధ్రప్రభ : ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలోని మారుతీనగర్ రోడ్ నంబర్-2లో త్రవ్విన రహదారిని పూర్తిచేయకుండా వదిలేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైటెక్ సిటీ ప్రాంతం నుంచి వచ్చే భారీ డ్రైనేజీ సమీపంలో కార్పొరేషన్ పరిధిలోని రహదారిని త్రవ్వి పనులను మధ్యలోనే నిలిపివేయడంతో స్థానిక కుటుంబాలకు రాకపోకలు కష్టతరంగా మారాయి. నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ డ్రైనేజీ కారణంగా మారుతీనగర్ రోడ్ నంబర్-2 ప్రమాదకరంగా మారినప్పటికీ, బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ పనుల విషయంలో కార్పొరేషన్, జాతీయ రహదారి అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని, “ఈ పని వారే చేయాలి”, “కాదు మీరే చేయాలి” అంటూ ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టివేస్తున్నారని విమర్శిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, పనుల జాప్యం కారణంగా స్థానిక కుటుంబాలు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, త్రవ్విన కల్వర్టుపై స్లాబ్ ఏర్పాటు చేసి రోడ్ నంబర్-2 రహదారిని త్వరితగతిన పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
