మత్తు వదలరా…
- గంజాయి నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ
- జిల్లా వ్యాప్తంగా మెగా గంజాయి టెస్టింగ్ కార్యక్రమాలు
- గంజాయి వినియోగదారులకు కౌన్సిలింగ్ ద్వారా మార్పు
- ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా’ లక్ష్యంగా నిరంతర చర్యలు
తిరుపతి, ఆంధ్రప్రభ : గంజాయి ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటంతో పాటు సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. “డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిధిలోని ప్రతి సబ్ డివిజన్లో సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో “మెగా గంజాయి టెస్టింగ్” కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనుమానిత ప్రాంతాలు, పరిశ్రమలు, కార్మికుల సమూహాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో గంజాయి పరీక్షలు నిర్వహిస్తూ మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులపై కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ వారిని మత్తు అలవాట్ల నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ పర్యవేక్షణలో తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కజారియా ఫ్యాక్టరీ, వి-ఫార్మ్ పరిశ్రమల కార్మికులకు మెగా గంజాయి టెస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సమక్షంలో కార్మికులకు పరీక్షలు నిర్వహించి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు, యువత, విద్యాసంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. “మత్తుకు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజ శాంతిభద్రతలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 (ఈగల్) టోల్ ఫ్రీ నంబర్ లేదా 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.
