అగ్నికి ఆహుతైన ఆశల నిలయం

అగ్నికి ఆహుతైన ఆశల నిలయం
ఇల్లు, పత్తి, గృహోపకరణాలు దగ్ధం.. నిరాశ్రయులైన కుటుంబం
ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ నిరుపేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కష్టపడి కూడబెట్టుకున్న ఇంటి సామాగ్రి, పంట దిగుబడి కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన మీరాల పెద్ద సమ్మయ్య రేకుల ఇల్లు అగ్నికి ఆహుతై పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 7 క్వింటాళ్ల పత్తితో పాటు గృహోపకరణాలు,ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి.ఈ ఘటనలో సుమారు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగాపురం సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు,పంచాయతీ కార్యదర్శి రామారావు,గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంటిని పూర్తిగా కాపాడలేకపోయారు.అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు వారికి ధైర్యం చెప్పారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన గృహోపకరణాలు అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపగా, ఒక్కసారిగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాన్ని చూసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం,దాతలు అండగా నిలవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
