తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళులు…

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘన నివాళులర్పించారు.

అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపనలో పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐక్యత, సౌభ్రాతృత్వంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు.

అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఇన్‌చార్జి ఆర్డీవో ప్రతాప్, ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply