Peddi | ఏపీలో సినిమా షూటింగ్లు పెంచండి… : మంత్రి దుర్గేష్

(విజయవాడ, ఆంధ్రప్రభ ) : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర వేడుక విజయవాడలో అభిమానుల సందడితో సినీ సంబరంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రామ్ చరణ్ నటనలో సహజత్వం, భావ వ్యక్తీకరణ అసాధారణమని కొనియాడారు.
‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ తరహా మాయాజాలాన్ని గుర్తు చేసే చిత్రంగా ‘పెద్ది’ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభ తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.
మంచి సినిమాలు విజయవంతమైతే వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందని దుర్గేష్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మరిన్ని షూటింగ్లు నిర్వహించాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ సదుపాయాల ఏర్పాటుకు ముందుకు రావాలని నిర్మాతలను ఆహ్వానించారు. సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన అనుమతులు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
