Biggest Controversies | ఐపీఎల్ 2026 సీజన్‌ను కుదిపేసిన 10 మోస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఇవే!

Biggest Controversies | ఐపీఎల్ 2026 సీజన్‌ను కుదిపేసిన 10 మోస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఇవే!
ఆంధ్రప్రభ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మే 31న అత్యంత ఘనంగా ముగిసింది. రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని కైవసం చేసుకుని అరుదైన చరిత్ర సృష్టించింది. గత మార్చిలో ప్రారంభమై.. దాదాపు రెండున్నర నెలల పాటు అభిమానులను అలరించింది ఈ మెగా టోర్నమెంట్.
అయితే, ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో 10 ఫ్రాంచైజీల మధ్య మైదానంలో ఎంత హోరాహోరీ పోరు సాగిందో.. మైదానం లోపల, బయట అంతే స్థాయిలో వివాదాలు (Biggest Controversies) కూడా చెలరేగాయి. ప్లేయర్స్ మధ్య పెరిగిన అగ్రెషన్, అంపైర్ల కాంట్రవర్షియల్ డెసిషన్స్, చివరకు సోషల్ మీడియా బ్యాన్స్ వరకు.. ఈ సీజన్‌ను కుదిపేసిన టాప్-10 మోస్ట్ కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం!
10.ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో జేసన్ హోల్డర్ పట్టిన ఒక లో-డైవింగ్ క్యాచ్ తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను అవుట్ చేయడానికి హోల్డర్ ముందుకు స్లైడ్ అవుతూ క్యాచ్ పట్టాడు. అయితే, బంతి నేలకు తాకినట్లు రీ-ప్లేలలో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ కేవలం 17 సెకన్లలోనే దీనిని అవుట్‌గా ప్రకటించడంతో విరాట్ కోహ్లీ, కోచ్ ఆండీ ఫ్లవర్ అంపైర్లతో తీవ్రంగా వాదించారు.
09.అలాగే, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ తిలక్ వర్మపై చేసిన జాత్యహంకారం వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విరాట్ కోహ్లీతో ఉన్న ఒక పాపులర్ రీల్‌తో సహా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి దాదాపు 200 పోస్టులను డిలీట్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఆటగాళ్లు అతిగా కంటెంట్ క్రియేట్ చేయవద్దని బీసీసీఐ హెచ్చరించడమే దీనికి కారణమని ప్రచారం జరిగింది.
08.మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ… మహ్మద్ షమీ త్రో వేస్తున్నప్పుడు కావాలనే అడ్డుపడ్డాడనే కారణంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ పద్ధతిలో వివాదాస్పదంగా అవుట్ అయ్యాడు. ఈ డెసిషన్ పై నిరాశతో వెనుదిరుగుతున్న రఘువంశీ బ్యాట్‌ను గాల్లోకి విసిరేశాడు. అయితే అందుకు కూడా అతనికి జరిమానా కూడా పడింది.
07.ఐపీఎల్ 2026 సీజన్‌లో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మరో ఆసక్తికర వివాదం రాజస్థాన్ రాయల్స్ (RR) క్యాంప్‌లో చోటుచేసుకుంది. ఆర్‌సీబీతో మ్యాచ్ జరుగుతుండగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ లైవ్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ సమయంలో అతని పక్కనే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉండటం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

ఐసీసీ, బీసీసీఐ రూల్స్ ప్రకారం అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అక్రమాలను అరికట్టడానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ లేదా డ్రెస్సింగ్ రూమ్‌లో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడటంపై కఠినమైన నిషేధం ఉంది. ఈ యాంటీ కరప్షన్ నిబంధనలను రోమి భిందర్ పూర్తిగా ఉల్లంఘించడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఆ సమయంలో తాను కేవలం అత్యవసర వైద్య కారణాల వల్లే మొబైల్ వాడాల్సి వచ్చిందని అతను వివరణ ఇచ్చినప్పటికీ బీసీసీఐ మాత్రం శాంతించలేదు. రూల్స్ అందరికీ ఒకటేనని స్పష్టం చేస్తూ, నిబంధనలు బ్రేక్ చేసినందుకు గానూ రోమి భిందర్‌కు ₹1 లక్ష జరిమానా విధిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.
06.ఇదే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ (ఈ-సిగరెట్) కాలుస్తూ లైవ్ టెలివిజన్‌లో కనిపించాడు. భారతదేశంలో ఈ-సిగరెట్ల నిషేధం నేపథ్యంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనివల్ల అతనికి 25% మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ లభించింది.
05.అంపైరింగ్ ప్రమాణాలపై అసంతృప్తితో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యాజమాన్యం బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేయడం ఈ సీజన్‌లో మరో పెద్ద వివాదం. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మల వివాదాస్పద క్యాచ్ అవుట్లు, అలాగే ఆవేష్ ఖాన్ బౌండరీ లైన్ వద్ద బంతిని తాకిన విధానంపై ఎస్‌ఆర్‌హెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
04.క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన టాస్ ప్రక్రియ కూడా వింత వివాదానికి దారితీసింది. టాస్ సమయంలో రియాన్ పరాగ్ ‘హెడ్స్’ అని పిలిచినప్పటికీ, మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ తనకు సరిగ్గా వినబడలేదని చెప్పి, గుజరాత్ టాస్ గెలిచినప్పటికీ దానిని రద్దు చేసి రెండోసారి టాస్ వేయించారు. ఈ నిర్ణయంపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

03.మే 11న రాయ్‌పూర్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ ఉత్కంఠ విజయం సాధించిన తర్వాత, బెంగళూరు బ్యాటర్ టిమ్ డేవిడ్ డగౌట్ నుండి ముంబై జట్టు వైపు మిడిల్ ఫింగర్ చూపించడం కెమెరాల్లో రికార్డైంది. పాత ఫ్రాంచైజీపై పగతో చేసిన ఈ పనికి అతనికి 30% మ్యాచ్ ఫీజు జరిమానా పడింది.
02.టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో జరిగిన స్లెడ్జింగ్… మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు హ్యాండ్ షేక్ చేసుకునే సమయంలో కోహ్లీ ఉద్దేశపూర్వకంగా ట్రావిస్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా దాటవేయడం సంచలనంగా మారింది.
01.వీటన్నింటికంటే పెద్ద వివాదం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. కోహ్లీ 63 పరుగుల వద్ద ఉన్నప్పుడు శుభ్‌మన్ గిల్ డైవ్ చేస్తూ ఒక క్యాచ్ పట్టాడు. అయితే బంతి నేలకు తాకిందని కోహ్లీ క్రీజ్ వదిలి వెళ్లకుండా గిల్‌తో మైదానంలోనే నేరుగా వాగ్వాదానికి దిగాడు. చివరికి థర్డ్ అంపైర్ దీనిని నాటౌట్‌గా ప్రకటించడంతో కోహ్లీ సంబరాలు చేసుకుని, అజేయంగా 75 పరుగులు చేసి ఆర్సీబీని వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలబెట్టాడు.
