ఆర్మూర్‌లో భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు..

ఆర్మూర్‌లో భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు..

  • ముగ్గురు నిందితుల అరెస్ట్,
  • రూ. 31.48 లక్షల సొత్తు స్వాధీనం

ఆర్మూర్/నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ పట్టణంలో ఇటీవల జరిగిన భారీ దొంగతనం కేసును నిజామాబాద్ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. సొంత బాబాయ్ ఇంట్లోనే చోరీకి పథకం వేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి మొత్తం రూ.31,48,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్వయంగా వెల్లడించారు.

దర్యాప్తు నేపథ్యం..

గత నెల మే 24న ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీలో నివసించే ఒక వ్యాపారి కుటుంబం వేములవాడ దేవస్థానం దర్శనానికి వెళ్లింది. ఇల్లు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తించిన నిందితులు ఇంట్లోకి చొరబడి రూ.41,31,500 విలువైన బంగారం, వెండి, నగదును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

అనుమానాస్పద కదలికలతో పట్టుబడ్డ నిందితులు..

బ్రాహ్మణపల్లి X రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

విచారణలో ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్ అప్పుల కారణంగా తన సొంత బాబాయ్ ఇంట్లోనే చోరీకి పథకం వేసినట్లు వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ దొంగతనానికి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని కూడా భాగస్వాములుగా చేర్చినట్లు సమాచారం.

స్వాధీనం చేసిన సొత్తు..

పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో బంగారు ముద్దలు, వెండి వస్తువులు, నగదు, సెల్‌ఫోన్లు ఉన్నట్లు తెలిపారు.

ముందస్తు నేర చరిత్ర..

ప్రధాన నిందితుడిపై ఇప్పటికే హత్యాయత్నం, బెదిరింపులు సహా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై రౌడీషీట్ కూడా తెరిచినట్లు తెలిపారు. పోలీసులు కేసును వేగంగా ఛేదించిన బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply