IPL Final 2026 | ‘ఈసాలా కప్ నమ్దే’ రిపీట్..

- ‘బ్యాక్-టు-బ్యాక్’ కప్ కొట్టిన ఆర్సీబీ..
- సిఎస్కే, ముంబై సరసన ఆర్సీబీ..
- వరుసగా రెండో కప్ కొట్టి రికార్డు!
- కింగ్ కోహ్లీ విశ్వరూపంతో గుజరాత్‌పై ఘన విజయం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. లీగ్ హిస్టరీలోనే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుస సీజన్లలో (Back-to-Back) టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-ప్రెజర్ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ డ్రైవర్ సీట్లో కూర్చుని జట్టును ముందుండి నడిపించి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
కోహ్లీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరూ పోటీ పడి ఆడుతూ 4.3 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 62 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఛేజింగ్‌ను ఈజీ చేసేశారు. వెంకటేష్ అయ్యర్ అవుటైన తర్వాత కూడా కోహ్లీ ఏమాత్రం తగ్గకుండా మరింత చెలరేగి ఆడాడు. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ.. కేవలం 25 బంతుల్లోనే 2 సిక్సర్లు, 7 ఫోర్లతో ఐపీఎల్ హిస్టరీలోనే తన కెరీర్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
మిడిల్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లు కాగిసో రబడ, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్లు వికెట్లు పడగొడుతూ ఆర్సీబీని గట్టి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఈ దశలో రజత్ పాటిదార్ (13 బంతుల్లో 15 పరుగులు), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) వాల్యూబుల్ ఇన్నింగ్స్ ఆడి కోహ్లీకి చక్కని సహకారం అందించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రన్ మెషిన్ కోహ్లీ ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడి కొనసాగించాడు. క్రీజులో కింగ్ ఉన్నంతసేపు మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ కంట్రోల్లోనే సాగింది.
చివరి ఓవర్లలో విరాట్ కోహ్లీ తన క్లాస్ అండ్ అగ్రెసివ్ షాట్లతో గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను పర్ఫెక్ట్గా ఫినిష్ చేశాడు. ఉత్కంఠ రేపిన 18వ ఓవర్లో కోహ్లీ ఒక ఫోర్, ఒక సిక్స్ బాది మ్యాచ్‌ను 18వ ఓవర్లోనే ముగించేశాడు. దాంతో ఆర్సీబీ డగౌట్, స్టేడియంలోని లక్ష మంది అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విరాట్ కోహ్లీ మొత్తం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు.
అంతకుముందు ఆర్సీబీ బౌలర్లు చేసిన అద్భుత ప్రదర్శనకు ఈ గెలుపుతో పర్ఫెక్ట్ ఫినిషింగ్ లభించింది. రాసిఖ్ సలామ్ (3 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (2 వికెట్లు), జోష్ హాజిల్‌వుడ్ (2 వికెట్లు) గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను 155 పరుగులకే కట్టడి చేశారు. గుజరాత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ (50 నాట్ అవుట్) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, కోహ్లీ చెలరేగడంతో ఆ స్కోరు ఆర్సీబీని ఆపలేకపోయింది.
