Real estate businessman kidnapped | రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్..

Real estate businessman kidnapped | రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్..
తిరుపతి క్రైమ్, (ఆంధ్రప్రభ) : తిరుపతి నగరంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సిఐ రామకృష్ణ తెలిపిన వివరాలు మేరకు.. సీతమ్మ నగర్ కు చెందిన రసూల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కడప జిల్లాకు చెందిన మనోహర్ రెడ్డి, ఖాజా పీర్, సుబ్బారెడ్డి, శివకుమార్‌లతో కలిసి నెల్లూరు జిల్లాలో రెడ్ సెంట్రల్ చెట్లు ఉన్న వెంచర్ స్థలం కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలానికి సంబంధించిన రూ.3 నుంచి రూ.4 కోట్ల ఆర్థిక లావాదేవీల విషయంలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రసూల్ తన న్యాయవాది ద్వారా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
శనివారం సీతమ్మనగర్‌లోని నందకం టీ దుకాణం వద్ద రసూల్ కూర్చొని ఉండగా, మనోహర్ రెడ్డి, ఖాజా పీర్, సుబ్బారెడ్డి, శివకుమార్ అక్కడికి చేరుకుని డబ్బుల వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, వారు రసూల్‌ను బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనను గమనించిన రసూల్ డ్రైవర్ వెంటనే అతని అన్న, రిటైర్డ్ ఏఎస్ఐ ప్రదీప్‌కు సమాచారం అందించాడు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు.
