పొగాకుకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుని వినూత్న ప్రచారం

పొగాకుకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుని వినూత్న ప్రచారం
సూర్యాపేట – ఆంధ్రప్రభ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్‌లో మద్దిరాల మండలం జడ్పీహెచ్‌ఎస్ గోరంట్ల పాఠశాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న పొగాకు వినియోగం నవతరాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులో సరదాగా ప్రారంభమయ్యే ధూమపాన అలవాటు క్రమంగా వ్యసనంగా మారి యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
పొగాకు వినియోగం కారణంగా మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు పెరిగి, సామాజిక, ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో పొగాకు వినియోగం ఒక సామాజిక మహమ్మారిగా మారుతోందని, దీని వల్ల నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధికంగా పెరుగుతున్నాయని అన్నారు.
అలాగే గుండెపోటు, అధిక రక్తపోటు, పక్షవాతం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు కూడా పొగాకు వినియోగమే ప్రధాన కారణమవుతోందని వివరించారు. పొగాకును నేరుగా వినియోగించే వారితో పాటు పరోక్ష ధూమపానానికి గురయ్యే వారి ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
బాలలు, యువత ధూమపానం, గుట్కా, ఖైనీ, మద్యపానం, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. లేనిపక్షంలో దేశానికి విలువైన జాతి సంపదను కోల్పోయినట్లేనని అన్నారు.
ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ, మైక్‌సెట్, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
