ఊట్కూర్‌లో హెచ్చరికలు..!

ఊట్కూర్‌లో హెచ్చరికలు..!

వివక్షపై కఠిన చర్యల సంకేతం

ఊట్కూర్, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని, అంటరానితనం వంటి ఆచారాలను పాటిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఊట్కూర్ ఆర్‌ఐ కృష్ణారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేందర్ గౌడ్ హెచ్చరించారు.

శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

కుల, మత భేదాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కులం పేరుతో దూషించడం, ఆలయ ప్రవేశాలను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

హోటళ్లలో రెండు గ్లాసుల విధానం పాటించడం వంటి వివక్ష చర్యలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసి ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని గుర్తుచేశారు. చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొల్లూర్ సర్పంచ్ సువర్ణమ్మ శ్రీనివాస్, జీపీఓ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply