రెబ్బెనపల్లిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కందుల కల్యాణి అశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఆర్‌ఐ భూమన్న, హెడ్ కానిస్టేబుల్ సత్తన్న, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బచ్చల అంజన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి ఉన్నత విద్యావంతులను చేయడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఎస్సీలకు కల్పించిన రిజర్వేషన్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామంలో ఉపాధి హామీ పనుల నిర్వహణ తీరును పరిశీలించిన వారు, ఎక్కడైనా అంటరానితనం లేదా వివక్ష కొనసాగుతోందా అనే విషయమై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలందరూ గ్రామంలో కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బాధితులు తమ రక్షణ కోసం వినియోగించుకోవాలని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ప్రతి దళిత కుటుంబం తమ ఇళ్లలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచుకుని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
