పనికి ఒకలా.. వేతనానికి మరోలా? కూలీల ఆగ్రహం

పనికి ఒకలా.. వేతనానికి మరోలా? కూలీల ఆగ్రహం

బెల్లంపల్లి ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామపంచాయతీ పరిధిలోని రంగంపేట వద్ద రంగం చెరువులో చేపట్టిన ఫిష్‌పాండ్ తవ్వక పనులను శనివారం ఉపాధి హామీ కూలీలు బహిష్కరించి నిరసన చేపట్టారు.

గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సంబంధిత సాంకేతిక అధికారులు పర్యవేక్షించడం లేదని, మెజర్‌మెంట్లు సక్రమంగా నిర్వహించడం లేదని కూలీలు ఆరోపించారు. గత మూడు వారాలుగా ఫిష్‌పాండ్ తవ్వక పనులు చేస్తున్న తమకు ఒక్కొక్కరికి రూ.300కు పైగా వేతనాలు రావాల్సి ఉండగా, తక్కువ పని చేసిన వారికి ఎక్కువ వేతనాలు జమ కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

విధులు బహిష్కరించి గంటపాటు నిరసన చేపట్టిన కూలీలు, అక్కడికి చేరుకున్న ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గోమాస సుజాతను నిలదీశారు. గత మూడు నెలలుగా టెక్నికల్ అసిస్టెంట్ పనుల వద్దకు రావడం లేదని, ఆమె రాకుండానే బిల్లులు, చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.

పని చేసిన వారికి తక్కువ, తక్కువ పని చేసిన వారికి ఎక్కువ వేతనాలు ఎందుకు వస్తున్నాయో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేశారు. పని ప్రదేశానికి వచ్చి టెక్నికల్ అసిస్టెంట్ స్వయంగా మెజర్‌మెంట్లు తీసుకోవాల్సి ఉండగా, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల సహాయంతో మెజర్‌మెంట్లు నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

సమాన పనికి సమాన వేతనం అందేలా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇందుకు ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

Leave a Reply