నేడు మహబూబ్‌నగర్‌లో మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యటన..

నేడు మహబూబ్‌నగర్‌లో మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యటన..
- అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
- ఐదు జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం
- కొనుగోలు కేంద్రాలు, గోదాములు, రైస్‌మిల్లుల పరిశీలన
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం (మే 30) ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఉమ్మడి జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
పర్యటన షెడ్యూల్ ఇదీ…
మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్ర మండలం అజిలాపూర్ గ్రామంలో రూ.32.05 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి’ మంత్రులు భూమిపూజ చేస్తారు.
ధాన్యం సేకరణపై సమీక్ష…
శంకుస్థాపన అనంతరం మంత్రులు నేరుగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ (ఐడీఓసీ) భవనానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:50 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల (మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి) వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో విస్తృతంగా సమీక్షిస్తారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మిల్లింగ్ ప్రక్రియ, గిడ్డంగుల లభ్యతపై దిశానిర్దేశం చేయనున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన…
సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ గోదాములు, రైస్ మిల్లులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. రైతులు, మిల్లు యజమానులతో మాట్లాడతారు.
