Union Minister | ధాన్యం సేకరణపై కిషన్‌రెడ్డి విమర్శలు

Union Minister | ధాన్యం సేకరణపై కిషన్‌రెడ్డి విమర్శలు
Union Minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియ సంతృప్తికరంగా లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం దళారీలు, అధికారులు, ప్రభుత్వ వ్యవస్థ మధ్య రైతులు నలిగిపోతున్నారని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంటను విక్రయించేందుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
బీజేపీ చేపట్టిన బస్సు యాత్ర తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.
