అమరవాది చెరువు పూడికతీతలో నిర్లక్ష్యం..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి పరిధిలోని అమరవాది చెరువు పూడికతీత పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుందని రైతులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి వచ్చిన మట్టి పేరుకుపోవడంతో గత పదేళ్లలో చెరువులో సుమారు మూడు మీటర్ల మేర పూడిక చేరిందని వారు తెలిపారు. దీంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయి, ప్రస్తుతం క్రీడా మైదానాన్ని తలపించే స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 100 కుటుంబాల ఉపాధి దెబ్బతిందని పేర్కొన్నారు.

ఇటీవల ఇరిగేషన్ శాఖ రూ.15.30 లక్షలు మంజూరు చేసి పూడికతీత పనులు చేపట్టినప్పటికీ, మూడు మీటర్ల లోతు వరకు పూడిక తొలగించాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్ లోతు కూడా తీయలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.

అమరవాది చెరువు కింద సుమారు మూడు ఎకరాల సాగుభూమికి నీరందే అవకాశం ఉందని, అయితే పనుల ఆలస్యం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ తన సొంత వాహనాలను వినియోగించకుండా, రైతులనే సొంత ఖర్చులతో మట్టిని తరలించేలా చేశారని ఆరోపించారు.

మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించారా లేదా అనే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని, వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని రైతులు, మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply