రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లకు బంపరాఫర్..
- ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ అప్డేట్..
- వెంటనే ఛాసిస్ నంబర్ చెక్ చేయండి
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ బైక్ యజమానులకు గుడ్‌న్యూస్. అరుదైన ఖనిజాల (Rare minerals) సరఫరాలో కొరత కారణంగా, రాయల్ ఎన్ఫీల్డ్ గేర్ పొజిషన్ సెన్సార్ లేకుండా మోటార్‌సైకిళ్లను తయారు చేసి విక్రయించింది. అయితే, ఇప్పుడు ఆ మోటార్‌సైకిళ్లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే గేర్ పొజిషన్ సెన్సార్‌ను అమర్చనున్నట్లు కంపెనీ తమ అధికారిక సపోర్ట్ పేజీలో ప్రకటించింది.
దీంతో క్లాసిక్ 350, గోవాన్ క్లాసిక్ 350, మీటియోర్ 350, హంటర్ 350 మోడళ్లలోని కొన్ని యూనిట్లలో ‘గేర్ పొజిషన్ సెన్సార్’కు బదులుగా ‘న్యూట్రల్ ఇండికేషన్ సిస్టమ్’ను తాత్కాలికంగా అమర్చి సేల్స్ చేసినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ బైక్‌లకు సంబంధిత సెన్సార్లను అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఈ మార్పుతో వాహన పనితీరు లేదా భద్రతకు ఎటువంటి లోపం కలగలేదని కంపెనీ స్పష్టం చేసింది.
ఉచితంగానే అమర్చనున్న కంపెనీ..
ఆ విడిభాగం అందుబాటులోకి వచ్చిన తర్వాత, ప్రభావితమైన బైక్‌లకు ‘గేర్ పొజిషన్ సెన్సార్’ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమర్చి ఇస్తామని రాయల్ ఎన్ఫీల్డ్ హామీ ఇచ్చింది. గేర్ పొజిషన్ సెన్సార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ప్రభావితమైన బైక్‌లకు.. సర్వీస్ సెంటర్లలో ఉచితంగా అమర్చుతామని కంపెనీ తెలిపింది. ఆ విడిభాగం లేదా దానిని అమర్చడానికి ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
మీ బైక్‌కు వర్తిస్తుందా?.. ఇలా చెక్ చేసుకోండి
గేర్ పొజిషన్ ఇండికేటర్ లేకుండా బైక్ డెలివరీ అయి ఉంటే.. సమీపంలోని రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించాలి. వెహికిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా ఛాసిస్ నంబర్ ఆధారంగా బైక్ అర్హతను సిబ్బంది పరిశీలిస్తారు. అలాగే సమాచారాన్ని తమ అధికారిక డిజిటల్ మాధ్యమాల ద్వారా అందిస్తామని, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ద్వారా కూడా ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
