Prajadarbar | పశ్చిమంలో ప్రజాదర్బార్

Prajadarbar | పశ్చిమంలో ప్రజాదర్బార్
- ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవ..
- భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో వినతుల స్వీకరణ..
- హాజరుకానున్న అధికారులు..
- లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఆంధ్రప్రభ భవానిపురం: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) శనివారం ప్రజాదర్బార్ (Prajadarbar ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజాదర్బార్ ద్వారా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు, వైద్య సహాయం, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అందజేయనున్నారు.
అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎంతో ఉపయుక్తంగా మారుతోందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. వైద్య చికిత్సల కోసం ఖర్చులు భరించలేని కుటుంబాలకు ఈ సహాయం ఆర్థిక భరోసానిస్తూ ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకు చేరేలా కృషి చేయడం ఎమ్మెల్యే లక్ష్యమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు సమాచారం.
