పీఎంజే చోరీ కేసు సూత్రధారి అరెస్ట్

పీఎంజే చోరీ కేసు సూత్రధారి అరెస్ట్
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి సుబోధ్ సింగ్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్‌పై అతడిని కరీంనగర్‌కు తీసుకువచ్చినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.
ఈ నెల 3న కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెల్లరీలో పనిచేసే ఉద్యోగులపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుబోధ్ సింగ్‌ను కరీంనగర్ పోలీసులు బీహార్‌లోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు.
సుబోధ్ సింగ్‌పై ఈ కేసుతో పాటు ఇతర కేసులు కూడా నమోదై ఉన్నాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని ఆరు కోర్టుల పరిధిలో పీటీ వారెంట్లకు అనుమతులు పొందిన తర్వాత అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు వివరించారు.
సుబోధ్ సింగ్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి కరీంనగర్‌కు చేరుకుంది. అనంతరం అర్ధరాత్రి నిందితుడిని గౌరవ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు సీపీ తెలిపారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని జైలుకు తరలించారు. కేసుకు సంబంధించిన అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు సుబోధ్ సింగ్‌ను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు.
