పొలం కాపలాకు వెళ్లి తిరిగిరాని వ్యక్తి..

మధిర, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామానికి చెందిన కటారు పెద్ద వెంకటేశ్వర్లు (58) వడదెబ్బకు గురై మృతి చెందారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద వెంకటేశ్వర్లు ప్రతిరోజులాగే బుధవారం సుబాబుల్ పొలానికి కాపలా కోసం వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఆయనకు వాంతులు కావడంతో పాటు ఒళ్లంతా చెమటలు పట్టి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను మధిరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన స్పృహ కోల్పోయినట్లు వైద్యులు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
ఖమ్మంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి పెద్ద వెంకటేశ్వర్లు మృతి చెందారు. వడదెబ్బ కారణంగానే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
