మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక…

మక్తల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఉపసర్పంచ్ మొగిలన్న శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మొగిలన్నకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మొగిలన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. తనతో పాటు పొట్ల కొండన్న, గడ్డమీది మహేందర్, డి. శ్రీనివాసులు, ఆర్. నవీన్, ఆర్. ప్రతాప్, ముత్త పరమేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని ఇప్పుడు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన మంత్రి, ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ డి. కృష్ణారెడ్డి, నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అంకె భాగ్యమ్మ చంద్రశేఖర్, నర్వ గ్రామ సర్పంచ్ టి. హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మార్కా నరేష్, నర్వ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గౌడ్, నాగిరెడ్డిపల్లి గ్రామ యూత్ అధ్యక్షుడు చెన్నారాయుడు తదితరులు పాల్గొన్నారు.
