21st may | తగిన నిర్ణయం తీసుకోవాలని మైటీ సమీక్షా కమిటీకి సూచ‌న‌

21st may | తగిన నిర్ణయం తీసుకోవాలని మైటీ సమీక్షా కమిటీకి సూచ‌న‌

21st may | ఆంధ్ర‌ప్ర‌భ, న్యూఢిల్లీ: “బొద్దింకల జనతా పార్టీ” (CJP)కు చెందిన బ్లాక్ చేయబడిన ‘X’ ఖాతాను పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని సమీక్షా కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ పురుశైంద‌ర్ కుమార్ కౌర‌వ్‌ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ అభిజీత్ దీప్కే సమర్పించిన ఫిర్యాదును పరిశీలించి, చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని MeitY సమీక్షా కమిటీకి సూచించారు.

అభిజీత్ దీప్కే స్థాపించిన “బొద్దింకల జనతా పార్టీ” ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందింది. నిరుద్యోగం, పాలన, రాజకీయ జవాబుదారీతనం వంటి అంశాలపై ఈ వేదిక పోస్టులు చేస్తూ ముఖ్యంగా యువతలో ఆదరణ సంపాదించింది. అయితే జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మే 21న భారతదేశంలో ఆ పార్టీ అసలు ‘X’ హ్యాండిల్‌ను నిలిపివేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నిఘా సంస్థల సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

దీనిపై అభిజీత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ‘X’ ఖాతాను నిలిపివేయడం వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఆయన వాదించారు. ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని కోర్టును కోరారు. ఇక ఈ చర్యలో భాగంగా పార్టీకి సంబంధించిన మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్ కూడా బ్లాక్ చేయబడ్డాయని లేదా హ్యాక్‌కు గురయ్యాయని పిటిషన్‌లో ఆరోపించారు. ఒక కోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను “బొద్దింకలతో” పోల్చుతూ వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఉద్యమం ప్రారంభమైనట్లు సమాచారం. అనంతరం అదే పేరుతో ఏర్పాటైన ఈ వ్యంగ్య రాజకీయ వేదిక సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

Leave a Reply