కడెంలో వికసించిన ‘మియాజకి’ అద్భుతం..

కడెంలో వికసించిన ‘మియాజకి’ అద్భుతం..

  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పంటకు శ్రీకారం

కడెం, ఆంధ్రప్రభ : వ్యవసాయంలో సరికొత్త ప్రయోగాలు, సేంద్రియ పద్ధతులు పాటిస్తే అసాధ్యమైనదాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో గల డాక్టర్ రాపల్లి సత్యం ట్రెడిషనల్ ఆశ్రమం నిరూపించింది. సత్యం ట్రెడిషనల్ ఆశ్రమం. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ.2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు వరకు పలికే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్ దేశపు ‘మియాజకి’ మామిడి పండ్లను ఆశ్రమ ప్రాంగణంలో విజయవంతంగా పండించారు.

రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్కలకు ఎలాంటి రసాయన ఎరువులు లేదా పురుగుమందులు ఉపయోగించకుండా, పూర్తిగా ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువులతోనే సంరక్షించారు. ఆశ్రమ నిర్వాహకుల ప్రత్యేక పర్యవేక్షణ, భూసార పరిరక్షణ చర్యల ఫలితంగా కేవలం రెండో ఏడాదిలోనే చెట్లు విశేష దిగుబడిని అందించాయి.

ఆశ్రమంలో తొలిసారిగా కాసిన ఈ అరుదైన మియాజకి మామిడి పండ్లను సత్యం ట్రెడిషనల్ వ్యవస్థాపకులు డాక్టర్ రాపెల్లి సత్యం స్వామీజీ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను కలిసి మర్యాదపూర్వకంగా అందజేశారు.

‘మియాజకి’ ప్రత్యేకత ఇదే..

ఈ పండ్ల విశేషాలను ఎమ్మెల్యేకు వివరిస్తూ స్వామీజీ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ పండ్లకు ఉన్న భారీ డిమాండ్‌కు కారణం వాటిలోని విలువైన పోషక, ఔషధ గుణాలేనని తెలిపారు.

ఆరోగ్యానికి వరం

మియాజకి మామిడిలో శరీర రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో హానికర కణాల ప్రభావాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్-ఎ, బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయని స్వామీజీ పేర్కొన్నారు.

రైతులకు లాభదాయక ప్రత్యామ్నాయం

మన జిల్లా వాతావరణ పరిస్థితులు ఈ అరుదైన రకం మామిడి సాగుకు అనుకూలంగా ఉన్నాయని, స్థానిక రైతులు ఈ పంట సాగు వైపు అడుగులు వేస్తే అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఇది రైతాంగానికి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటగా మారే అవకాశం ఉందన్నారు.

గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చ

మియాజకి పండ్లను అందజేసిన అనంతరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై స్వామీజీ ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంట్యాల లచ్చన్న, గ్రామ అధ్యక్షుడు మేడి లచ్చన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నూటికట్ల శంకర్, సత్యం ట్రెడిషనల్ ట్రస్ట్ కోశాధికారి మేడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.