Telangana Irrigation | 24 గంటల కరెంట్ లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు

Telangana Irrigation | 24 గంటల కరెంట్ లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు
Telangana Irrigation | ఎత్తిపోతల ప్రాజెక్టులపై వేల కోట్ల విద్యుత్ బకాయిల భారం
ఆన్-ఆఫ్ విధానంతో మోటార్లకు ముప్పు
కాళేశ్వరం సహా ప్రధాన ప్రాజెక్టులపై ప్రభావం
ఎత్తిపోతల పథకాలకు 6 వేల మెగావాట్ల అవసరం
సాగు సీజన్‌పై నెలకొన్న అనిశ్చితి
Telangana Irrigation | హైదరాబాద్, ఆంధ్రప్రభ: వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఎత్తిపోతల పథకాల భవితవ్యం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎత్తిపోతలపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి తార్కాణంగా కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు వెక్కిరిస్తున్నాయి. బిల్లులు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తామని విద్యుత్ శాఖ తేల్చిచెబుతోంది. ప్రస్తుతం 24 గంటల విద్యుత్‌కు బదులుగా కేవలం 12 గంటలు మాత్రమే సరఫరా చేస్తుండటంతో కాళేశ్వరం అనుబంధ ఎత్తిపోతల ప్రాజెక్టులతో పాటు ఇతర ఎత్తిపోతల ప్రాజెక్టులు ఆశించిన మేర నీటిని ఎత్తిపోవడంలేదు.
ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులు, కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, దేవాదుల, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తిగా పంపింగ్ స్టేషన్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ లిఫ్ట్ స్కీమ్‌లకు సంబంధించిన విద్యుత్ బిల్లులే రూ.27,027 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇప్పటికే పూర్తయిన పనులకు రూ.863.51 కోట్లు, నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్‌లు, విద్యుత్ మౌలిక వసతులకు రూ.3,900.81 కోట్లు, నిర్వహణ ఖర్చులకు రూ.1,745 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బకాయిలు రూ.33,536.32 కోట్లకు చేరాయి. 24 గంటల కరెంట్ లేకుంటే చివరి ఆయకట్టుకు నీరు చేరదు. బకాయిలు ఇంకా పేరుకుపోతే పూర్తిగా పథకాలు నిలిచిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
• ఇప్పటివరకు పేరుకుపోయిన రూ.33 వేల కోట్ల బకాయిలు
• చెల్లించేందుకు ముందుకు రాని సర్కారు
• ఏ క్షణాన నిలిచిపోతాయో తెలియక అన్నదాతల ఆందోళన
• ఆన్-ఆఫ్ విధానం వల్ల పంపులకు ముప్పు తప్పదన్న నిపుణులు
ఆన్-ఆఫ్‌తో మోటార్లకు ముప్పు
ప్రస్తుతం ట్రాన్స్‌కో అమలు చేస్తున్న ఆన్-ఆఫ్ విధానంపై ఇరిగేషన్ ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీ సామర్థ్యం కలిగిన పంపులను పదేపదే ఆన్-ఆఫ్ చేయడంతో తీవ్రమైన ప్రకంపనలు ఏర్పడి మోటార్లు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మేడారం, రామడుగు పంపింగ్ స్టేషన్లలో ఇంపెల్లర్లు దెబ్బతిన్నాయి.
పంపింగ్ స్టేషన్ల కింద ఉన్న చెరువులు, రిజర్వాయర్లు పూర్తిగా నింపాలంటే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 10 మెగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన పంపులు ఉన్న ప్రాజెక్టుల్లో ఆన్-ఆఫ్ విధానం ప్రమాదకరం అని చెబుతున్నారు.
ఎత్తిపోతలకు 6 వేల మెగావాట్ల అవసరం
రాష్ట్రంలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. ఏటా ఏప్రిల్, మే నెలల్లోనే విద్యుత్ అవసరాలపై అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి, ట్రాన్స్‌కోకు అందజేస్తున్నప్పటికీ ఈసారి ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న వేళ.. ఎత్తిపోతల పథకాలే రైతుకు ప్రాణాధారంగా మారనున్నాయి. ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రాబోయే సాగు సీజన్‌పై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
