Tragic incident | సెంట్రల్ లాక్ జామ్‌తో నలుగురు సజీవ దహనం

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అజ్మీర్ జిల్లా బోరాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం కారులో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరి తల్లికి అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. అదే సమయంలో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ కావడంతో కారులో ఉన్న వారు బయటకు రాలేకపోయారు. ఈ ఘటనలో రామ్‌సింగ్ చౌదరి, ఆయన భార్య, తల్లి, జిల్లా పరిషత్ సభ్యురాలు పూసీ దేవి సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply