మానసిక ఆరోగ్య సేవలు ఎంతో ప్రయోజనకరం

మానసిక ఆరోగ్య సేవలు ఎంతో ప్రయోజనకరం
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఆకాంక్షిత మండలంలో కమ్యూనిటీ మెంటల్ హెల్త్ కార్యక్రమాలను అమలు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. నైపుణ్య శిక్షణ పొందిన అభ్యర్థులకు ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆయన సర్టిఫికెట్లు, జీవనోపాధి సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు. కేవలం ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా మానసిక ఆరోగ్య కార్యక్రమ సేవలను విస్తరించాలని కోరారు.
మానసిక సమస్యలకు కేవలం మందుల ద్వారానే కాకుండా, నైపుణ్య శిక్షణలు ఇవ్వడం వల్ల బాధితులు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. శిక్షణల వల్ల మనసు దృష్టి మళ్లుతుందని, గుంటుపల్లి రైజ్ సెంటర్‌లో అందించే శిక్షణలను సైతం అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు మానసిక ఆరోగ్యంపై సమాజంలో ఉన్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
వాసవ్య మహిళా మండలి ప్రతినిధి డాక్టర్ బొల్లినేని కీర్తి మాట్లాడుతూ సంస్థ ద్వారా, ‘లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్ సహకారంతో 28 మంది సభ్యులకు జీవనోపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. వీటితోపాటు ప్రభుత్వం అందించే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు కూడా బాధిత కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయని ఆమె చెప్పారు.
అనంతరం బేసిక్ టైలరింగ్‌లో నైపుణ్య శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రాజెక్టు లబ్ధిదారులకు రూ. 2.40 లక్షల విలువైన తోపుడు బండ్లు, టీ స్టాల్ సామగ్రి, కూరగాయల వ్యాపారం, పండ్ల వ్యాపారం, ఫ్యాన్సీ వస్తువుల వ్యాపార సామాగ్రి, టైలరింగ్ మెటీరియల్ వంటి జీవనోపాధి సాధనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, ఎంపీడీవో డి.శకుంతల, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆర్.రామారావు, వాలంటీర్లు, సపోర్టు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.
