మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్టీఐహెచ్ అండ..

మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్టీఐహెచ్ అండ..
స్పార్క్ కార్యక్రమానికి విశేష స్పందన
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించే దిశగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైజ్‌అప్ ఎంఎస్ఎంఈ ఎంపవరింగ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్పార్క్’ కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి.
బుధవారం ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా యంత్రాంగం, ఎంఎస్ఎంఈ శాఖ సహకారంతో ప్రతి వారం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మహిళలకు వ్యాపార అవకాశాలు, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ సదుపాయాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధిపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ బృందాలతో మాట్లాడారు. ఆర్టీఐహెచ్ అందిస్తున్న డిజిటల్ ఎనేబుల్మెంట్, ఇన్నోవేషన్ వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు ఐడియా దశ నుంచి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగి “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్” లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఈ-కామర్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ట్రేడ్‌మార్క్, జీఎస్టీ వినియోగాలు, బ్రాండింగ్, వ్యాపార విస్తరణ అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అనంతరం వన్-టు-వన్ ఇంటరాక్షన్ ద్వారా వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేక మార్గదర్శకాలు అందించారు.
కార్యక్రమంలో మహిళా సమాఖ్య ప్రతినిధులు, వామార్ట్ అధికారులు, ఐపీఆర్ అటార్నీ, ఆర్టీఐహెచ్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ పాల్గొన్నారు.
