తప్పులేని ఓటర్ల జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి

తప్పులేని ఓటర్ల జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
భీమవరం పట్టణంలోని స్వర్ణ వార్డు కార్యాలయాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులతో (BLOలు) సమావేశమై ఓటర్ల మ్యాపింగ్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
కొన్ని ప్రాంతాల్లో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండటంపై కలెక్టర్ ఆరా తీశారు. ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా, విదేశాల్లో నివసిస్తున్నారా వంటి వివరాలను సమగ్రంగా సేకరించి ఖచ్చితమైన సమాచారంతో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆమె సూచించారు.
ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని బూత్ లెవల్ అధికారులకు ఆదేశించారు.
వేసవి తీవ్రత నేపథ్యంలో మూగజీవాలకు త్రాగునీరు, ఆహారం అందించేందుకు మున్సిపల్, పశుసంవర్ధక శాఖలు చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. నీటి టబ్బులను తనిఖీ చేసి, పట్టణంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా నీటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కోటిలింగరాజు, సహాయ మున్సిపల్ కమిషనర్ ఏ. రాంబాబు, స్వర్ణ వార్డు సెక్రటరీ రుద్ర గుప్త, సిబ్బంది పాల్గొన్నారు.
