నర్సాపురంలో ఘనంగా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర…

నర్సాపురంలో ఘనంగా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర…
గోదావరి నది తీరాన జలధార–జలహారతి..
నదీ జలాల సంరక్షణకు ప్రతి పౌరుడు బాధ్యత..
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి…
నరసాపురం, ఆంధ్రప్రభ : నర్సాపురం వశిష్ఠ గోదావరి నదీ తీరాన జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రత్యేక కార్య క్రమం చేపట్టారు. ప్రతీ నెలా మూడో శనివారం నిర్వహించే “స్వచ్ఛంద స్వర్ణాంధ్ర” కార్య క్రమంలో భాగంగా ఈ నెల “జలధార–జలహారతి” కార్యక్రమంను శనివారం ఘనంగా నిర్వహించారు. నరసాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వశిష్ట గోదావరి నది ఒడ్డున నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలోనే వారు నదిలో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించి, పర్యావరణ పరిరక్షణపై తమ బాధ్యతను చాటిచెప్పారు. అనంతరం నదీ పరివాహక ప్రాంతంలో మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. తరువాత వశిష్ట గోదావరి నది తీరంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాతకు జలహారతి సమర్పించారు.
కార్యక్రమంలో భాగంగా వై.ఎన్ కళాశాల, సూర్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన “స్వచ్ఛ మానవహారం”లో పాల్గొని జిల్లా కలెక్టర్ అందరితో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జలహారతి అనేది భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం అని పేర్కొన్నారు. నదులు, భూమి, గాలి అని ప్రకృతి సంపదలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
“జలధార – జలహారతి” కార్యక్రమం ద్వారా నదుల పరిరక్షణ, పర్యావరణ శుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించి, నరసాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దే దిశగా ఆశాభావం వ్యక్తం చేశారు. నదుల్లో చెత్త, వ్యర్థాలు వేయడం ద్వారా వాటిని కలుషితం చేయకూడదని, వాటిని దేవతలుగా భావించి సంరక్షించాలన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా నదుల ప్రాముఖ్యతను గ్రహించి సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు.
నరసాపురం పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం ప్రజల చేతుల్లోనే ఉందని, అధికారులు గత కొన్ని నెలలుగా చెత్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందిస్తే మున్సిపాలిటీపై భారం 90% తగ్గుతుందని స్పష్టం చేశారు. శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. నదీ తీర ప్రాంతాల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నరసాపురంలో డంపింగ్ సమస్య తీవ్రంగా ఉందని, గతంలో గోదావరి ఒడ్డున చెత్తను వేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం తాత్కాలిక పరిష్కారం అందించినప్పటికీ శాశ్వత పరిష్కారం కోసం చర్యలు కొనసాగుతు న్నాయని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా కలిసిపోవడం వల్ల చెత్త నిర్వహణ కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తడి–పొడి చెత్త వేరు చేయడం ద్వారా సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని సూచించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి…
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ లు పిలుపు ఇచ్చారు. పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గోడపత్రికను వారు ఆవిష్క రించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పోషకాహారం ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న పోషణ అభియాన్ కార్యక్రమాల లక్ష్యం ప్రతీ కుటుంబానికి సమతుల్య ఆహారం అందించడం, పోషకాహార లోపాలను తగ్గించడం అని చెప్పారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి పోషకాహారం కీలకమని, తల్లిదండ్రులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేసి ప్రతీ బాలుడికి సరైన పోషణ అందేలా చూడాలని కోరారు.
పోషణ పక్వాడా కార్యక్రమాలు కేవలం ఒక వేడుకగా కాకుండా, ప్రతి ఇంటికి చేరే అవగాహన కార్యక్రమాలుగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ ఆహారంలో పచ్చి కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం చేర్చుకోవాలని, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సమాజం మొత్తం ఆరోగ్యవంతంగా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసి రాజు, తహసిల్దార్ ఐతం సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట రమణారెడ్డి, ఎంపీడీవో ఎం.నాసరు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీమన్నారాయణ, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పెద్దిరాజు, మత్స్యకార సంఘ అధ్యక్షులు మైల వసంతరావు, నియోజక వర్గ ఇంచార్జి పొత్తూరీ రామరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు కొప్పటి రవీంద్ర, విద్యార్థులు, అంగన్వాడి కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
