ఆలయ ప్రతిష్ట దెబ్బతీయొద్దు.. నిరాధార ఆరోపణలు సహించం…

ఆలయ ప్రతిష్ట దెబ్బతీయొద్దు.. నిరాధార ఆరోపణలు సహించం…
ఆలయ చైర్మన్ మోహన్ శర్మ
మహదేవపూర్, (ఆంధ్రప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మ తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మహిళలను అవమానించే సంస్కారం తమకు లేదన్నారు. “మా ఇంట్లో కూడా బిడ్డలు, చెల్లెళ్లు, అక్కలు, తోబుట్టువులు ఉన్నారు. మహిళలను గౌరవించే వారమే” అని స్పష్టం చేశారు.
తనపై ఆరోపణలు చేస్తున్న నాయకులు ఫిర్యాదు చేసిన మహిళలు ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆయా మహిళలకు ఆలయం నుంచి గుర్తింపు కార్డులు జారీ చేశారా, సేవల కోసం ముందుగా దేవస్థానానికి సమాచారం ఇచ్చారా, దరఖాస్తులు సమర్పించారా అనే అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు.
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఒకేసారి పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి రావడంతో భక్తుల దర్శనాలకు అంతరాయం కలిగిందన్నారు. రూ.300 స్పర్శ దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఆలయ డ్రెస్ కోడ్‌లో వచ్చిన మహిళలు ఫుల్ లైన్‌లో నిలబడటంతో రద్దీ పెరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది, ట్రస్ట్ బోర్డు సభ్యులు, డైరెక్టర్ మనోహర్ సమక్షంలో పలుమార్లు మహిళలను జరగాలని కోరినా స్పందించలేదన్నారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు సిబ్బంది సహాయంతో వారిని బయటకు పంపించామని వివరించారు.
ఈ విషయాలను పక్కనపెట్టి రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని మోహన్ శర్మ పేర్కొన్నారు. తాను ఎవరినీ కించపరిచే విధంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. దేవాలయంపై అసత్య ప్రచారాలు చేస్తూ “పిచ్చిపిచ్చిగా మాట్లాడితే” ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు వ, ఆరోపణలు చేస్తే కఠినంగా స్పందిస్తామని తెలిపారు.
