రెండు రోజుల్లో గృహ గణన పూర్తి చేయాలి…

రెండు రోజుల్లో గృహ గణన పూర్తి చేయాలి…
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి సమీక్ష
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో జరుగుతున్న గృహ గణన నమోదు కార్యక్రమాన్ని మరో రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం ఆమె మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ గణన నమోదు ప్రగతిని సమీక్షించారు.
గృహ గణన నమోదు కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేయడం అత్యంత ముఖ్యమని ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రోజువారీ ప్రగతిని సమీక్షించాలని సూచించారు.
ఎటువంటి పొరపాట్లు, లోపాలు లేకుండా గృహ గణన నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి. శివన్నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
