అక్రమ మట్టి దందా భండారం బట్టబయలు

అక్రమ మట్టి దందా భండారం బట్టబయలు
- మూడు టిప్పర్లు అదుపులోకి
హన్మకొండ క్రైమ్, ఆంధ్రప్రభ:
నగర పరిధిలోని చెరువుల నుంచి అక్రమంగా మట్టి తవ్వి జనావాసాలు, నూతన నిర్మాణాలకు విక్రయిస్తూ దందా చేస్తున్న టిప్పర్ డ్రైవర్లను కేయూ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
కేయూ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, నగర చుట్టుపక్కల చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వాటిలో ఒక టిప్పర్ మట్టితో నిండుగా ఉండగా, రెండు టిప్పర్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
టిప్పర్ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అదే సమయంలో బుధవారం పెగడపల్లి ప్రాంతంలో మరో అక్రమ మట్టి డంప్‌పై సమాచారం అందింది. ట్రాక్టర్ల ద్వారా రైతులకు ఒక ట్రాక్టర్ మట్టిని రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అయితే పోలీసులు వచ్చే సమాచారం ముందుగానే తెలిసిపోవడంతో మట్టి దందా నిర్వహిస్తున్న వారు ట్రాక్టర్లతో సహా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
