గాలివాన బీభత్సం.. తడిసిన ధాన్యంతో రైతుల ఆవేదన

గాలివాన బీభత్సం.. తడిసిన ధాన్యంతో రైతుల ఆవేదన

గజ్వేల్, ఆంధ్రప్రభ:

మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో కురిసిన గాలివాన బీభత్సానికి భారీగా వరిధాన్యం తడిసిపోయింది. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన రైతు కాటు కిష్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని చూసి కంటతడి పెట్టిన ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

గజ్వేల్ రింగ్ రోడ్డుపై రైతులు ఆరబెట్టిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన రైతు యాదయ్య ధాన్యం వర్షపు నీటితో మురికి కాలువలో కొట్టుకుపోవడంతో ఆయన కుటుంబం తీవ్ర వేదనకు గురైంది. గ్రామంలోని రైతులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.

ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే డిమాండ్‌తో భారత రాష్ట్ర సమితి పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధర్నా, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply