TGS RTC | హైదరాబాద్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం

TGS RTC | హైదరాబాద్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
TGS RTC | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : హైదరాబాద్ లో టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కూకట్పల్లి డిపోకు చెందిన 60 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి.. కాలుష్య నియంత్రణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభంతో నగర ప్రజలకు మరింత మెరుగైన, పర్యావరణహిత రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “కాలుష్యం పెరిగి హైదరాబాద్ మరో ఢిల్లీలా మారకూడదనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం” అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే 540 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తున్నాయని వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి.. త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికైన సంఘాలతో ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రతి రెండో మంగళవారం కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

