Mahanadu2026 | సాంకేతికతతో ‘పసుపు పండుగ’కు శ్రీకారం

Mahanadu2026 | సాంకేతికతతో ‘పసుపు పండుగ’కు శ్రీకారం

Mahanadu2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : సోషల్ సైకోల తాటతీసి.. మహిళల గౌరవాన్ని కాపాడతామని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ ‘మహానాడు-2026’ అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులర్పించారు.

ఈసారి మహానాడును పూర్తిగా సాంకేతికత ఆధారంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1875 క్లస్టర్లలో 1851 క్లస్టర్లను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్లస్టర్‌ను టు-వే కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నేరుగా అనుసంధానం చేసి, కార్యకర్తలతో నేతలు ప్రత్యక్షంగా మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను పార్టీ శ్రేణులు ‘పసుపు పండుగ’గా అభివర్ణిస్తున్నాయి.

ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ అనే ప్రధాన థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పార్టీ నిర్మాణంలో మహిళల పాత్ర, సామాజిక సేవలో భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ‘కార్యకర్తే అధినేత’, ‘యువగళం’, ‘పేదల సేవలో టీడీపీ’ వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.

మహాసభల్లో మొత్తం 10 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రారంభోపన్యాసం చేయనుండగా, అనంతరం నారా లోకేశ్ ప్రసంగించనున్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ వ్యూహాలపై కీలక సందేశాలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply