తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం..

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అర్ధరాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గాలుల దిశ మారుతున్నందున వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పంటలను భద్రపరచుకోవాలని, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు. ఇక ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
