పరిశ్రమల లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలి

పరిశ్రమల లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలి

– కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యాలను అధిగమించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. పరిశ్రమల స్థాపన, ఎగుమతుల ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా, జాయింట్ కలెక్టర్ డా. యం.జె. అభిషేక్ గౌడ్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచి ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచించారు.

ITDA ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని తెలిపారు.

జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల టార్గెట్ 168 కాగా ఇప్పటివరకు 102 యూనిట్లు గ్రౌండింగ్ అయినట్లు అధికారులు వివరించగా, మిగిలిన 66 యూనిట్లకు బ్యాంకు రుణాలు త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం 100 శాతం పూర్తి చేయాలని సూచించారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి 130 యూనిట్ల లక్ష్యాన్ని కూడా అధిగమించాలని ఆమె స్పష్టం చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేయాలని, చింతలపూడి నియోజకవర్గంలో పనులు ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలో రెండు నెలల్లో, కైకలూరు, పోలవరం నియోజకవర్గాల్లో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నూజివీడు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఈ నెలాఖరులోగా శంకుస్థాపనలకు సిద్ధం చేయాలని సూచించారు.

నిరుద్యోగ యువతకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు త్వరగా మంజూరు చేయాలని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమల రాయితీల కింద 13 యూనిట్లకు రూ.19.12 కోట్లు, రెండు యూనిట్లకు రూ.7.50 లక్షల స్టాంప్ డ్యూటీ సబ్సిడీ మంజూరు చేసినట్లు తెలిపారు.

రాంప్ ప్రోగ్రాం లక్ష్యాలను జూన్ చివరినాటికి పూర్తి చేయాలని, ఐపీఆర్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రూ.20 లక్షల వ్యయంతో కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ యూనిట్ ఏర్పాటు కోసం భూసేకరణ చేపట్టాలని సూచించారు.

Leave a Reply