ఇష్టారీతిన మాట్లాడితే తీవ్ర పరిణామాలు..

ఇష్టారీతిన మాట్లాడితే తీవ్ర పరిణామాలు..

  • నోరు జారితే ఊరుకునేది లేదు..
  • నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నా..
  • మాజీ మంత్రి కొప్పులపై మంత్రి అడ్లూరి ఫైర్

ధర్మారం, ఆంధ్రప్రభ : నోరుంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తనపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నోరు జారితే ఊరుకునేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యులపై మోయలేని భారం పడుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సంక్షేమాన్ని మరిచిపోయారని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా భవన్ నిర్మాణం చేసుకుంటే కేటీఆర్, హరీష్ రావులు జన్వాడలో ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఏనాడు విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేయలె దన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో సంక్షేమానికి ఒక వసతిగృహం నిర్మించలేదని మంత్రి ఆరోపించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చె స్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ధర్మారం మండలంలోని మిగులు భూములను పేద ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ధర్మారం మండలంలోని బొమ్మ రెడ్డిపల్లిలో 79 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విడిపించామని నర్సింగాపూర్లో అనర్హుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను తీసుకొని పేద ప్రజలకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని, అది సరైన పద్ధతి కాదని కొప్పులకు మంత్రి అడ్లూరి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply