ఇష్టారాజ్యంగా జేసీబీతో మట్టి తరలింపు

ఇష్టారాజ్యంగా జేసీబీతో మట్టి తరలింపు
- తిరగబడిన ఉపాధి కార్మికులు..
- జేసీబీ ఓనర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: భూపాలపల్లి మండలంలోని వజినపల్లి గ్రామంలో జేసీబీ సహాయంతో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా గ్రామ పరిసర ప్రాంతాల్లో రాత్రింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
గ్రామస్తుల కథనం ప్రకారం, ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రాంతాల్లో జేసీబీని వినియోగిస్తూ భారీగా మట్టిని తవ్వి తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
జేసీబీ యజమాని తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఉపాధి హామీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమకు ఉపాధి హామీ పథకం కింద లభించాల్సిన పనులను యంత్రాలతో చేయించడం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని కార్మికులు వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాల వినియోగం జరుగుతుంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తరలింపుపై వెంటనే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ మట్టి తరలింపు కారణంగా గ్రామ రహదారులు దెబ్బతింటున్నాయని, రాత్రి వేళల్లో ట్రాక్టర్ల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.
ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి తరలింపును అరికట్టి, గ్రామస్తులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
