వరంగల్‌పై నిజామాబాద్ జట్టు ఘన విజయం

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఘట్కేసర్ లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. వరంగల్ జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టు 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

జట్టు కెప్టెన్ విక్రమ్ నాయక్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో కేవలం 57 బంతుల్లోనే 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆకర్షణీయమైన బౌండరీలు, భారీ సిక్సర్లు ప్రేక్షకులను అలరించాయి. విక్రాంత్ రెడ్డి 43 పరుగులు, దామా అజిత్ రాజ్ 33 పరుగులు చేసి జట్టుకు విలువైన పరుగులు జోడించారు. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ జిల్లా జట్టు నిజామాబాద్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తట్టుకోలేక 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది.
నిజామాబాద్ బౌలర్లలో లలిత్ రెడ్డి 3 వికెట్లు, రుత్విక్ రావు 3 వికెట్లు, విక్రమ్ నాయక్ 2 వికెట్లు సాధించి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. జట్టు విజయంపై నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం. వెంకట్ రెడ్డి, కోశాధికారి కె. శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రటరీ కమ్ కోచ్ ఏ. సురేష్ బాబు ఆటగాళ్లను అభినందించారు. ఇదే జోష్‌తో రాబోయే మ్యాచ్‌ల్లో కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, నిజామాబాద్ జిల్లా జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టోర్నీలో అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
