వేసవి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి

వేసవి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి
అగ్ని ప్రమాదాలపై వేగవంతమైన స్పందన అవసరం : కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల పట్ల అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం విజయవాడ బస్ స్టేషన్ సమీపంలోని ఫైర్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.

అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ పరికరాలను పరిశీలించిన కలెక్టర్ అత్యవసర సేవలకు వినియోగించే పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎత్తయిన భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించే ప్రత్యేక వాహనాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
ఫైర్ స్టేషన్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును కూడా సమీక్షించారు. అత్యవసర సమాచారాన్ని వేగంగా అందుకునేలా, చేరవేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎప్పటికప్పుడు క్రియాశీలంగా ఉండాలని సూచించారు. సాంకేతిక లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో ఫైర్ సర్వీసెస్ కీలక భూమిక పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. వేసవి కాలంలో షార్ట్ సర్క్యూట్లు సహా వివిధ కారణాలతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ భద్రతా చర్యలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫైర్ 101 సేవతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్, డయల్ 100 ద్వారా వచ్చే కాల్స్‌పై అధికారులు అప్రమత్తంగా స్పందించాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, సహాయ అగ్నిమాపక అధికారి సీహెచ్ సూర్యప్రకాశ్‌రావు తదితరులు ఉన్నారు.
