రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

బంటుమిల్లి, ఆంధ్రప్రభ ; రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. మంగళవారం బంటుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు రైతులకు ఆయన స్వయంగా విత్తన బస్తాలను అందజేశారు.

ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని పెంచుకోవడంలో పచ్చిరొట్ట ఎరువులైన జనుము, పిల్లిపెసర వంటివి ఎంతో కీలమని తెలిపారు. వీటి సాగు వల్ల భూమికి అవసరమైన నత్రజని లభిస్తుందని, తద్వారా దిగుబడులు పెరుగుతాయని రైతులకు వివరించారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని రైతు సేవ కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ విత్తనాల పంపిణీలో ఎటువంటి జాప్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply