ఉచిత విద్యుత్‌పై అపోహలు సృష్టించే ప్రయత్నం..

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేస్తామని ఎక్కడా ప్రకటించలేదని, అయినప్పటికీ టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సిహెచ్ భవాని ఆరోపించారు.
బుధవారం మండల కేంద్రమైన కడెంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని, అధికారంలోకి రాగానే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు.
ఈ విషయాన్ని చూసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. ప్రీపెయిడ్ మీటర్లు పెడతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మోటర్లకు మీటర్లు, ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని బీజేపీతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా ప్రీపెయిడ్ మీటర్లను అమలు చేస్తామని చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలను అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు.
రెండు సంవత్సరాల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, పేదలకు రేషన్ కార్డులు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందజేశామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలపై అధిక వడ్డీలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు తప్పుడు సమాచారం ఇస్తే ప్రజలు విశ్వసించరని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని భవాని హెచ్చరించారు.
