నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
- పరారిలో ప్రధాన సూత్రదారి
- వారి వద్ద నుంచి 30 కిలోల విత్తనాలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.లక్షల విలువైన 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఆదేశాల మేరకు తాండూరు సీఐ దేవయ్య పర్యవేక్షణలో ఎస్సై కే.ప్రసాద్, మండల వ్యవసాయ అధికారిని కొండల సుష్మ సిబ్బందితో కలిసి సోమవారం రెచిని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు.
రోళ్ళపాడు నుండి రెచిని గ్రామానికి బైక్పై సంచిలో నకిలీ పత్తి విత్తనాలు తెచ్చి కొనుగోలుదారులకు ఇస్తున్న క్రమంలో నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్టైన వారిని రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామ పరిధిలోని రోళ్ళపాడుకు చెందిన గోగర్ల మల్లేష్, తాండూరు మండలం రెచిని గ్రామానికి చెందిన ముక్క శ్రీకాంత్, గాండ్ల మహేష్, పిడుగు లక్ష్మణ్లుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ప్రధాన సూత్రధారి తిరుమలశెట్టి రామకృష్ణ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. రామకృష్ణ తన పొలాన్ని కౌలుకు చేస్తున్న మల్లేష్ ద్వారా ఈ నకిలీ విత్తనాలను బైక్పై తెప్పించి రెచిని గ్రామస్తులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మీడియాకు వివరించారు.
గ్లైపోసిట్ కలిగిన నకిలీ విత్తనాల వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా దిగుబడి తగ్గి పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ నకిలీ విత్తనాలు వాడే రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దళారుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, కేవలం లైసెన్స్ పొందిన ఫెర్టిలైజర్ దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో తాండూరు సీఐ దేవయ్య, ఏఓ సుష్మ, ఎస్సై ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
