క్షేత్రంలో భక్తుల సందడి..

క్షేత్రంలో భక్తుల సందడి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది.

వచ్చిన భక్తుల కోసం దేవస్థానం అధికారులు తాగునీరు, చిన్నారులకు పాలు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని పూజల్లో ప్రార్థించారు.
ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, ప్రమాదాలు తగ్గాలని ప్రత్యేక యజ్ఞాలు నిర్వహించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని భక్తులు దేవస్థానం అధికారులను కోరుతున్నారు.
