24thMayeditorial | సమకాలీన రాజకీయాల్లో మోడీ ప్రత్యేకత

24thMayeditorial | సమకాలీన రాజకీయాల్లో మోడీ ప్రత్యేకత

24thMayeditorial | ఐరోపా పర్యటనలో మోడీ దౌత్య చాతుర్యం
సోషల్ మీడియాపై మోడీ ఫోకస్
యువత అసంతృప్తి వెనుక రాజకీయ సంకేతాలు
సోషల్ మీడియాలో మోడీ ఆధిపత్యం
ఏఐ యుగంలో పాలనపై మోడీ హెచ్చరిక

24thMayeditorial | ఆధునిక రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రగణ్యుడు. రాజకీయ వ్యూహాల్లోనే గాక, వర్తమాన పరిస్థితులపై సమగ్ర అవగాహనతో, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో తనకుతానే సాటి. ఈ విధంగా సమాజంలో వస్తున్న మార్పులను, ట్రెండ్‌ను గుర్తించి, అందుకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతున్న నేతలు సమకాలీన రాజకీయాల్లో మరొకరు లేరనేచెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీది బూమర్ జనరేషన్.. కానీ ఆలోచనలు జెనీ తరానివి. ఇదే ఆయన విజయ రహస్యం.

మోడీది ఆర్ఎస్ఎస్ నేపథ్యమే అయినా, ఎదిగింది హిందుత్వ పార్టీ గొడుగు కిందే అయినా, ఎప్పటికప్పుడు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ వచ్చారు. తాజాగా అయిదు దేశాల ఐరోపా పర్యటనలో కూడా ఆయా దేశాధినేతలతో జరిపిన చర్చలు, కుదుర్చుకున్న ఒప్పందాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రతికూల, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఏ విధంగా చాకచక్యంగా నెట్టుకొచ్చారో చాలా స్పష్టంగా ప్రపంచానికి చాటారు. మరీ ముఖ్యంగా జాత్యహంకార ధోరణితో ఐరోపా మీడియా వ్యవహరించిన సందర్భంలో మోడీ సమయస్ఫూర్తితో, దేశ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా నేర్పుగా వ్యవహరించడమే కాకుండా, పాశ్చాత్య దేశాధినేతల మన్ననలు కూడా పొందారు.

ఐరోపా పర్యటన నుంచి ఆయన తిరిగి వచ్చీ రాగానే అత్యవసరంగా నిర్వహించిన పూర్తిస్థాయి మంత్రివర్గ సమావేశం అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే, అందరూ ఊహించినట్టు పశ్చిమాసియా యుద్ధం, పొదుపు చర్యలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి మాత్రమే కాకుండా, దేశంలో సోషల్ మీడియా, దాన్ని విస్తృతంగా ఫాలో అవుతున్న యువత రీల్స్ గురించి ఆయన ప్రస్తావించడం సచివులనే కాకుండా రాజకీయ పండితుల్ని కూడా విస్మయపరిచింది. సోషల్ మీడియా ట్రెండ్‌ను పట్టించుకోకుండా ఏ అంశాలపైనా సరైన నిర్ణయం తీసుకోలేమన్న ఆయన అభిప్రాయం కచ్చితంగా అభినందనీయమే.

ఇక దేశీయ పరిస్థితుల విషయానికొస్తే మోడీ ప్రభుత్వం పట్ల యువత ఒకింత అసహనంతో ఉంది. కారణాలు ఏమైనప్పటికీ మొత్తానికి యువతరం అసంతృప్తితో రగులుతోంది. తాజా పరిణామాలు ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నాయి. ఆ మాటకు వస్తే, ప్రతి అంశంపైనా ఎంతోకొంత వ్యతిరేకత రావడం సహజమే. కానీ, అది ఎంత శాతం ప్రభావం చూపుతుందో అంచనాకు రావడమే పరిణతి సాధించిన రాజకీయ నేత లక్షణం. ఇందులో మోడీ మాస్టర్స్ కాదు… ఏకంగా పీహెచ్డీ చేశారనిపిస్తోంది.

సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్స్ వేదికగా మోడీకి ఏకంగా 106 మిలియన్ మందికి పైగా అనుచరులు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో వంద మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్‌బుక్‌లో 50 మిలియన్ మంది మద్దతుదారులు ఉన్నారు. ఈస్థాయిలో ఫాలోవర్లు ప్రపంచంలో ఏ రాజకీయ నేతకూ సోషల్ మీడియాలో లేకపోవడం విశేషం.

కేవలం సోషల్ మీడియాలో వస్తున్న రీల్స్, ఇతర వార్తల ఆధారంగానే మోడీ జననాడి పట్టుకోగలుగుతున్నారన్న అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. అందుకే కొన్నిసార్లు ఎవరూ ఊహించని రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం యువతను ఉద్దేశించి కాక్రోచ్ అనే పదాన్ని సీజేఐ వాడినందుకే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.

ఏఐ వచ్చాక అన్నిరంగాల్లోనూ మార్పులు వేగంగా వస్తున్నట్టే, పాలనా రంగంలోనూ చోటుచేసుకుంటున్నాయి. దీన్ని ముందుగా పసిగట్టింది మాత్రం నిస్సందేహంగా మోడీనే. అందుకే మంత్రివర్గ సహచరులను అప్రమత్తం చేశారు. “అప్‌డేట్ అవ్వండి.. లేదంటే కేబినెట్‌లో చోటు ఉండదు” అంటూ హెచ్చరిక చేశారు. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవడం ఒక ఎత్తయితే, అందుకు అనుగుణంగా అత్యవసర చర్యలకు ఉపక్రమించడం మరొక ఎత్తు. ఈ విషయంలో మిగతా నేతలకంటే ఎంతో ఎత్తులో ప్రధాని మోడీ ఉన్నారనడంలో ఎలాంటి సంశయంలేదు.

Leave a Reply